ఓటరు జాబితా ప్రచురణకు షెడ్యూల్
నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తామని ప్రకటించడంతో ఇంతకు ముందు తయారు చేసిన ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తిరిగి ప్రచురించాలని సూచించింది. అక్టోబర్ 2వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వచ్చినా లేదా సుమోటోగా అభ్యంతరాలుంటే పరిశీలించి వాటిని సరి చేయాలని సూచించింది. ఈ నెల 20వ తేదీన పొరపాట్లను సరిచేయాలని పేర్కొంది. 22వ తేదీన వచ్చిన అభ్యంతరాలు పరిశీలించాలని, 23న ఫైనల్ రి పబ్లికేషన్ ఫొటోలతో ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ప్రచురించాలని పేర్కొంది. అదే రోజు పోలింగ్ స్టేషన్ల జాబితాను తిరిగి ప్రచురించాలని సూచించింది.
నేడు కేంద్ర మంత్రి రాక
నల్లగొండ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం నల్లగొండ రానున్నారు. నల్లగొండలోని పెద్దబండలో ఎఫ్‌సీఐ బఫర్ స్టోరేజీ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
తూకం యంత్రాల పరిశీలన
నల్లగొండ : జిల్లాలో కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 994 రేషన్ షాపులు ఉండగా పెరిగిన గ్రామ పంచాయతీలతో మరో 54 కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొత్త షాపులకు ఇవ్వాల్సిన తూకం యంత్రాలు బుధవారం నల్లగొండ డీఎస్‌వో కార్యాలయానికి చేరాయి. ఆ యంత్రాల పనితీరును ఏఎస్‌ఓ రాజశేఖర్ పరిశీలించారు.
నేడు మానవహక్కుల కమిషన్ చైర్మన్ రాక
రామగిరి(నల్లగొండ) : మానవహక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ గురువారం నల్లగొండకు రానున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారో త్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉదయం 11.30 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగనున్న అక్షరాస్యత దినోత్సవంలో ఆయన పాల్గొంటారని తెలిపారు.
పత్తి కొనుగోలు
చేయాలని రాస్తారోకో
డిండి : పత్తి కొనుగోలు చేయాలని డిండి మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి సమీపంలో జడ్చర్ల–కోదాడ హైవేపై రైతులు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలింగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మండలంలో ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు చేస్తున్నారని రైతులకు తెలపడంతో రాస్తారోకో విరమించారు.
ఓటరు జాబితా ప్రచురణకు షెడ్యూల్


