రోడ్లపై ధాన్యం.. వాహనదారులకు ప్రాణ సంకటం
రామగిరి(నల్లగొండ): రైతులు తమ పంటలను ఆరబెట్టడానికి రహదారులను వాడుతున్నారు. ధాన్యంపై నల్లటి టార్పాలిన్ కప్పడంతో రాత్రి సమయంలో అది స్పష్టంగా కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవయ్యే అవకాశం ఉంది. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే దారిలో రోడ్డుపై రైతులు తమ ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం పైనుంచి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని వాహనదారులు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
కేతేపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం రాశులు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. వరి పంటను యంత్రాలతో కోయిస్తుండడంతో ధాన్యం పచ్చిగా ఉంటోంది. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు వ్యవసాయ బావుల వద్ద కల్లాలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారు. కొర్లపహాడ్, చీకటిగూడెం గ్రామాల్లో హైవేతోపాటు, కొప్పోలు, ఉప్పలపహాడ్, భీమారం గ్రామాల్లో బీటీ రోడ్లు పూర్తిగా ధాన్యం రాశులతో నిండిపోయాయి. ధాన్యానికి రక్షణగా రోడ్డుపైనే బండరాళ్లు పెడుతున్నారు. దీంతో రాత్రివేళ ప్రయాణించే వాహనాదారులకు దగ్గరకు వచ్చే వరకు రోడ్డుపై ఉంచిన రాళ్లు కనబడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై రాళ్లు పెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.
రోడ్లపై ధాన్యం.. వాహనదారులకు ప్రాణ సంకటం


