శిశు విక్రయాలు నివారించాలి
నల్లగొండ : శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం మున్సిపల్ కమిషనర్లు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, ఎంపీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 30లోగా అన్ని గ్రామాల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూల్ తయారు చేసుకొని విడతల వారీగా సమావేశాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాల్యవివాహాలు, బాలికలు యుక్త వయసులో గర్భం దాల్చడం తదితర అంశాలపై చర్చించాలని, ఈ అంశాలపై బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోక్సో చట్టం, చిన్న వయసులోనే గర్భం దాల్చడం, అక్రమ దత్తత, మత్తుమందులకు బానిసలు కాకుండా ఉండే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం గుర్తించిన తండాలు ,గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాక మరోసారి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల సమావేశాలకు తనతో పాటు, ఎస్పీ, అదనపు కలెక్టర్, ఏఎస్పీ, జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీపీఓ వెంకయ్య పాల్గొన్నారు.
చీరల పంపిణీని విజయవంతం చేయాలి
నల్లగొండ : జిల్లాలో ఇందిరా మహిళశక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తోందన్నారు. మహిళలకు ఇప్పటివరకు రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. పాఠశాలల్లో యూనిఫాం కుట్టే బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని వారికి రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 554 కోట్ల రూపాయల విలువ చేసే అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


