విద్య.. ప్రగతికి మూలం
రామగిరి (నల్లగొండ) : మనిషి ప్రగతికి మూలం.. విద్య అని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని, పేదల సంక్షేమానికి గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ.. ఏదైనా సాధించాలనే తపన, కోరిక కలిగి ఉండాలని, చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సంతోషంగా, ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పారు. జిల్లా గ్రంధాలయ సంస్థ ప్రస్తుత భవనం సరిపోనందున పాత టౌన్ హాల్ స్థానంలో నూతన భవనం నిర్మించే ఆలోచనలో ఉన్నామని, అందుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశామని వెల్లడించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఏ.హఫీజ్‌ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బి.బాలమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


