పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు
ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం
బీసీలకు అదనంగా పెరిగేవి రెండు స్థానాలే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం పాత పద్ధతిలోనే అమలు చేయనుంది. ఆ ప్రకారం జిల్లాలో బీసీలకు 166 స్థానాలే లభించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి 310 సర్పంచ్ స్థానాలు దక్కేలా చర్యలు చేపట్టినా.. ఆ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్లనే వర్తింపజేస్తూ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల పనుల్లో నిమగ్నం కానుంది.
పాత రిజర్వేషన్ల ప్రకారం 166 స్థానాలే..
రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ చేసి, ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు రిజర్వేషన్ల జాబితా సిద్ధం చేసి సెప్టెంబరు 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలోని 869 గ్రామ పంచాయతీల్లో 114 గిరిజన పంచాయతీలు పోగా, 755 గ్రామ పంచాయతీల్లో 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 310 స్థానాలను కేటాయించేలా చర్యలు చేపట్టింది. రిజర్వేషన్ల పెంపును సవాల్‌చేస్తూ రెడ్డి జాగృతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పేర్కొంటూ ఆ ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో, బీసీలకు 22 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీంతో బీసీలకు 166 స్థానాలే దక్కనున్నాయి. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం 310 స్థానాలకు కేటాయించేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
10.73 లక్షల ఓటర్లు
జిల్లాలోని 33 మండలాల్లో 869 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 7,494 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో అప్పట్లోనే ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దాని ప్రకారం 10.73 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చింది.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను గుజరాత్ రాష్ట్రం నుంచి తెప్పించి మొత్తం 9996 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసినా ఎన్ని కల నిర్వహణకు సిద్ధమవుతోంది. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఇప్పటికే శిక్షణ ఇచ్చి ఇచ్చింది.
ఫ 42 శాతం రిజర్వేషన్ అమలైతే
310 స్థానాలు దక్కేవి
ఫ రిజర్వేషన్ల కోటా 50 శాతం
మించొద్దని చెప్పిన కోర్టు
ఫ పార్టీ పరంగా 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించనున్న కాంగ్రెస్
ఫ ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం..
జిల్లాలో 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జిల్లాలో 844 స్థానాలు ఉన్నాయి. అప్పట్లో గిరిజన గ్రామ పంచాయతీలు 104 పోగా.. మిగిలిన 740 గ్రామ పంచాయతీల్లో 22 శాతం రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 164 స్థానాలు లభించాయి. ప్రస్తుతం జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 869కి పెరిగింది. అయినా అదనంగా రెండు స్థానాలు పెరిగి 166 పంచాయతీలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వంద శాతం గిరిజన పంచాయతీల సంఖ్య 114కు పెరిగింది. వాటిని మినహాయించి లెక్కిస్తే 755 గ్రామ పంచాయతీల ఆధారంగానే రిజర్వేషన్లను కల్పించనున్నారు. వాటి ప్రకారం బీసీలకు 166 స్థానాలు దక్కనున్నాయి. మరోవైపు పెరిగిన 25 గ్రామ పంచాయతీల్లో వంద శాతం గిరిజన గ్రామాల కింద 10 పంచాయతీలు పోగా, మిగతా 15 స్థానాల్లో రెండు బీసీలకు, 13 స్థానాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతోపాటు జనరల్ స్థానాల్లోనే కలవనున్నాయి.
పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు


