విద్యుత్ శాఖ.. ప్రజాబాట
ప్రజలకు ఎంతో మేలు
వారంలో మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8 గంటలకే గుర్తించిన ప్రాంతాలకు ఏఈ, ఇతర అధికారులు వెళ్లి ప్రజాబాట నిర్వహించాలి. దీని కోసం జీపీఎస్ ద్వారా అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఎక్కడో ఉండి హాజరైటన్లుగా చూపించే అవకాశం లేకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఈతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా ఎస్‌ఈ, డీఈ, ఏడీఈలంతా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక చోట తప్పనిసరిగా హాజరవుతారు.
నల్లగొండ : నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా టీజీఎస్‌పీడీసీఎల్ ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టింది. మొదట పట్టణ, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో విడతలో పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబర్ నెల నుంచి వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శనివారం) ప్రజాబాట నిర్వహించి విద్యుత్ సరఫరాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడంతో పాటు ప్రజలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తోంది.
నాణ్యమైన విద్యుత్ అందించేలా..
విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టణాల్లో పర్యటించి ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యలను తెలుసుకొని తక్కువ ఖర్చుతో కూడుకున్న వాటిని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఎక్కువ వ్యయంతో కూడుకున్న పనులకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులే కాకుండా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద చెట్ల పొదలు, తీగ జాతి చెట్లను తొలగిస్తున్నారు. ఇనుప స్తంభాలను గుర్తిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడితే జరిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
ఫ వారంలో మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు
ఫ తొలుత పట్టణాల్లో నిర్వహణ
ఫ బస్తీల్లో విద్యుత్ సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ
టీజీఎస్‌పీడీసీఎల్ చేపట్టిన ప్రజాబాట ద్వారా వినియోగదారులకు మేలు చేకూరనుంది. చిన్న సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్యలను ప్రజాబాటలో అధికారులు గుర్తిస్తారు. ఎలాంటి సమస్యలున్నా ప్రజలు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలి. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించడమే సంస్థ లక్ష్యం.
– వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ


