వారం రోజులుగా మిల్లు బయటే..
తిప్పర్తి : కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ఖరీదు చేసిన ధాన్యం లారీ దిగుమతికాక.. వారం రోజులుగా మిల్లు ముందే ఉంది. వివరాలలోకి వెళితే నల్లగొండ మండలం శేషమ్మగూడెం గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో రైతులు పేర్ల నాగమ్మ (352 బస్తాలు), బొజ్జ శ్రీను (356 బస్తాలు)కు చెందిన ధాన్యాన్ని కాంటా వేసిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లి గ్రామంలోని సాయి వెంకటేశ్వర మిల్లుకు పంపారు. మిల్లు యజమాని ధాన్యం బాగాలేదని లారీని తిరస్కరించాడు. దీంతో ఈనెల 13వ తేదీ నుంచి లారీ మిల్లు బయటే ఉంది. ధాన్యం బాగా లేకుంటే కాస్త కోత విధించి అయినాదిగుమతి చేసుకోవాలని రైతులు కోరగా.. మంగళవారం దిగుమతి చేసుకుంటామని చెప్పిన మిల్లు యాజమాన్యం 25 క్వింటాళ్ల కోత విధిస్తామని చెప్పాడు. అంతకోత విధిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు చెప్పడంతో మిల్లు యజమాని ధాన్యం దిగుమతి చేసుకోలేదు. దీంతో వారం రోజులుగా రైతులు మిల్లు వద్దే పడిగాపులు కాస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.


