పార్ట్‌టైం జాబ్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల టోకరా | - | Sakshi
Sakshi News home page

పార్ట్‌టైం జాబ్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల టోకరా

Nov 16 2025 10:56 AM | Updated on Nov 16 2025 10:56 AM

పార్ట్‌టైం జాబ్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల టోకరా

పార్ట్‌టైం జాబ్‌ పేరిట సైబర్‌ నేరగాళ్ల టోకరా

చౌటుప్పల్‌: పార్ట్‌టైం జాబ్‌ పేరిట సైబర్‌ నేరగాళ్లు ఓ యువకుడికి టోకరా పెట్టారు. అత్యాశకు పోయిన సదరు యువకుడు ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి చౌటుప్పల్‌ పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల అతడి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. కాగా.. ఈ నెల 5న అతడి వాట్సాప్‌కు సైబర్‌ నేరగాళ్లు ఓ మెసేజ్‌ పంపారు. దీంతో సదరు యువకుడు నాలుగు రోజుల పాటు చాటింగ్‌ చేశాడు. అనంతరం యువకుడిని సైబర్‌ నేరగాళ్లు తమ వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చుకున్నారు. అనంతరం స్వాతికృష్ణ అనే మహిళ పేరుతో సదరు యువకుడితో వాట్సాప్‌లో చాటింగ్‌ చేసి సెల్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ ద్వారా ఇంటి వద్దనే ఉంటూ ప్రతిరోజు రూ.5వేల నుంచి రూ.8వేల వరకు సంపాదించవచ్చని నమ్మించారు. దీంతో ఈ నెల 10న యువకుడు తన ఫోన్‌ నంబర్‌తో ఐడీ క్రియేట్‌ చేసుకుని తన వివరాలను వారికి షేర్‌ చేశాడు. వెంటనే మరో యువతి లైన్‌లోకి వచ్చి తన పేరు, ఇతర వివరాలు చెప్పి తాను హోటల్‌ రిసెప్షనిస్ట్‌నని పరిచయం చేసుకుంది. యువకుడి పేరు, ఫోన్‌, చేసే పనితో పాటు వ్యక్తిగత వివరాలు సైతం సేకరించింది. తర్వాత తన ఐడీతో రూ.800 పెట్టుబడి పెట్టమని యువకుడికి చెప్పింది. కొద్ది క్షణాల్లోనే రూ.1040 లాభం వచ్చినట్లు అతడి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. అనంతరం అతడితో పలుమార్లు పెట్టుబడి పెట్టించారు. వాటికి రూ.40,000 లాభం వచ్చినట్లు మెసేజ్‌ చేశారు. కానీ ఆ డబ్బులను తమ వద్దనే పెట్టుకున్నామని, వాటికి మరింత తాము జమ చేస్తామని నమ్మించారు. అయినా వదలని కేటుగాళ్లు ఆ యువకుడితో ఆరోజు మొత్తంగా రూ.2,92,663 పెట్టుబడిగా పెట్టించారు.

అప్పు తెచ్చి.. పెట్టుబడి పెట్టి..

ఇంత జరిగినా ఇదేదో మోసంగా ఉన్నదని యువకుడు గ్రహించకుండా పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాలి, అవసరమైతే రెండింతల లాభాలు గడించాలని ఆశ పెంచుకున్నాడు. మరుసటి రోజున పెట్టుబడి పెట్టేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఈ నెల 11న తన బంధువు వద్ద రూ.5,00,000 అప్పుగా తెచ్చుకున్నాడు. ఈ నెల 12న తిరిగి తన వద్ద ఉన్న డబ్బులను పెట్టుబడిగా పెట్టాడు. అదంతా పోయింది. మొత్తంగా ఆ యువకుడు రూ.8,42,663 పోగొట్టుకున్నాక ఇక వద్దనుకునే ఆలోచన చేస్తుండగా.. తిరిగి కేటుగాళ్లు మరోసారి లైన్‌లోకి వచ్చారు. నీకు 90పాయింట్లు వచ్చాయి, 100పాయింట్లు పూర్తయితే నీ డబ్బులు తిరిగి వస్తాయి, అందుకోసం నీకు తక్కువగా ఉన్న 10పాయింట్లను పాయిట్‌కు 10వేల రూపాయల చొప్పున రూ.1,00,00తో కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో తీవ్రంగా ఆలోచన చేసిన సదరు యువకుడు జరిగిన విషయాన్ని అదే రోజున తన మిత్రులతో పంచుకున్నాడు. స్నేహితులు చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. అయినప్పటికీ కేటుగాళ్లు యువకుడిని ఏమాత్రం వదలకుండా వాట్సాప్‌ చాటింగ్‌ చేస్తూ మరింతగా ప్రలోభాలకు గురిచేయసాగారు. చివరకు ఈ నెల 14న సదరు యువకుడు 1940 నంబర్‌కు ఫోన్‌చేసి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. శనివారం సైబర్‌ క్రైం కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు.

యువకుడి నుంచి రూ.8,42,663 కొట్టేసిన కేటుగాళ్లు

సైబర్‌ క్రైంకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement