పల్టీకొట్టిన కంప్రెషర్ ట్రాక్టర్
● డ్రైవర్ మృతి
● మృతుడు అడ్డగూడూరు వాసి
కేసముద్రం: కంప్రెషర్ ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి శివారులోని ఓ క్వారీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కాట్రపల్లి గ్రామ శివారులోని క్వారీలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన గుంజ రాములు(53) కంప్రెషర్ నడుపుతున్నాడు. శనివారం క్వారీలోకి కంప్రెషర్ ట్రాక్టర్‌ను వెనక్కి తీసుకెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. దీంతో పది ఫీట్ల ఎత్తునుంచి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వ్యక్తి అదృశ్యం
భూదాన్‌పోచంపల్లి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి 13 రోజులైనా తిరిగి రాకపోవడంతో బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు శనివారం భూదాన్‌పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేశ్‌ముఖి గ్రామానికి చెందిన వరికుప్పల స్వామి (40) ఈనెల 2న ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. గతంలో కూడా ఇలానే ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగైదు రోజుల తరువాత వచ్చాడు. ఈసారి కూడా అలానే వస్తాడని కుటుంబ సభ్యులు 13 రోజులుగా ఎదురుచూశారు. కాని తిరిగి రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన
ఆర్టీసీ బస్సు
చివ్వెంల(సూర్యాపేట): ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ హైవేపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో దురాజ్‌పల్లి గ్రామ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో సుమారు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాలను రోడ్డు పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పల్టీకొట్టిన కంప్రెషర్ ట్రాక్టర్


