హైవేపై వాహనాలు తనిఖీ చేస్తుండగా..
నాగారం: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై శనివారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అతివేగంతో కారులో వస్తున్న వ్యక్తులు కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నాగారం మండల పరిఽధిలోని నాగారం బంగ్లాలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం బంగ్లాలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ శీలం కమలాకర్(34)కు గతంలో తనతో కలిసి కానిస్టేబుల్‌గా పనిచేసిన అశోక్ కలవడంతో రోడ్డు పక్కకు వచ్చి అతడితో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జనగామ నుంచి సూర్యాపేట వైపు అతివేగంగా కారులో వెళ్తున్న వ్యక్తులు ముందున్న ఆటోను ఓవర్‌టేక్ చేయబోయి రోడ్డు పక్కన నిల్చున్న కానిస్టేబుల్ కమలాకర్, అశోక్‌తో పాటు మరో వ్యక్తిని ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కమలాకర్‌కు రెండు కాళ్లు విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. అశోక్‌కు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. కానిస్టేబుల్ కమలాకర్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. మృతుడి స్వగ్రామం కోదాడ మండలం గుడిబండ గ్రామం. అతడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌కు తరలించేకంటే ముందు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కానిస్టేబుల్ కమలాకర్‌ను ఎస్పీ నరసింహ పరామర్శించారు.
కారు ఢీకొని కానిస్టేబుల్ మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
హైవేపై వాహనాలు తనిఖీ చేస్తుండగా..


