గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
సూర్యాపేటటౌన్: టేకుమట్ల నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని, ముఖంపై యాసిడ్ పోసిన గుర్తులు ఉన్నాయని, అంతేకాకుండా పెట్రోల్‌తో మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించినట్లు ఉందని పోలీసులు తెలిపారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ కూడా మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పరిశీలించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ, సూర్యాపేట రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712686006 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.


