‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది’
చిట్యాల: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో పోలీసులు వినూత్న రీతిలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది’ అని హోరింగ్‌పై పెద్ద అక్షరాలతో రాయించారు. దాని కింద ‘ఎవ్రీ లైఫ్ కౌంట్–నల్లగొండ పోలీస్ కేర్’ అని రాసి ఉంది. అంతేకాకుండా.. రోడ్డు ప్రమాదానికి గురై తుక్కుగా మారిన కారును కూడా హోర్డింగ్‌కు ప్రత్యేకంగా అమర్చారు. ఈ హోర్డింగ్.. హైవే మీద ప్రయాణించే వారికి ఒక కిలోమీటర్ దూరం నుంచే కనిపించేలా 25ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. భారీ హోర్డింగ్‌ను గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ప్రారంభించారు. హైవేపై అతివేగంగా వెళ్లే వాహనదారులను హెచ్చరించేందుకు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రహదారి వెంట ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలకు అనుగుణంగా నియమిత వేగంతో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకోవాలన్నారు.


