కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం
ఫ బస్సు టైరు ఎక్కడంతో బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాయి
ఫ ప్రయాణికురాలి తలకు తగలడంతో తీవ్ర గాయాలు
కోదాడ: కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం సాయంత్రం ఊహించని ప్రమాదం జరిగింది. మేళ్లచెరువు మండలానికి చెందిన ఓ ప్రయాణికురాలు బస్సు కోసం కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లో వేచి ఉండగా.. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు వేగంగా బస్టాండ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో బస్టాండ్ ఆవరణలో ఉన్న గులకరాయి పైకి బస్సు టైరు ఎక్కడంతో రాయి బుల్లెట్ వేగంతో వచ్చి ప్లాట్‌ఫాం వద్ద నిల్చున్న ప్రయాణికురాలి తలకు తగిలింది. ఏం జరిగిందో తెలుసుకొనే లోపే మహిళ కుప్పకూలిపోయింది. తోటి ప్రయాణికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
మిర్యాలగూడ టౌన్: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మిర్యాలగూడ మండలంలో జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తక్కేళ్లపాడు గ్రామానికి చెందిన గుండు సురేష్(25) తన ఇంటికి వచ్చి పక్కనే ఉన్న దొడ్డిలోకి ట్రాక్టర్‌లో నుంచి గడ్డి కట్టలు దింపే క్రమంలో అడ్డుగా ఉన్న విద్యుత్ సర్వీసు వైరును కర్ర సహాయంతో పక్కకు జరుపుతుండగా.. విద్యుత్ వైరు చేతిపై పడి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న గుండు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
పాలకవీడు: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం శూన్యపహాడ్ వెళ్లే రోడ్డు మార్గంలో అదానీ సిమెంట్ పరిశ్రమ సమీపంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ ఆర్. కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహంకాళిగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల లింగయ్య(45) బైక్‌పై వెళ్తుండగా.. కంకర లోడ్‌తో శూన్యపహాడ్ వైపు వెళ్తున్న టిప్పర్ ఎదురుగా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనం ఢీకొని..
మిర్యాలగూడ: రోడ్డు దాటుతున్న వ్యక్తిని బొలేరో వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తలపాలెం గ్రామానికి చెందిన పోలేపల్లి లక్ష్మయ్య(38) గ్రామ పరిధిలో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి దాటుతుండగా గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు.
బైక్‌పై వెళ్తూ డీసీఎంను ఢీకొని ఒకరు మృతి
మునగాల: విజయవాడ–హైదరాబాద్ హైవేపై మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఒకరు మృతిచెందారు. మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. మృతుడు కోదాడ మున్సిపాలిటీలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎస్‌కే సిరాజ్‌గా పోలీసులు గుర్తించార. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
మునగాల: మునగాల మండలం నేలమర్రి–మాధవరం గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డుపై గురువారం ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నేలమర్రి గ్రామానికి చెందిన రెణబోతు జానకిరెడ్డి తాను పండించిన ధాన్యాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించేందుకు ట్రాక్టర్‌లో తీసుకెళ్తుండగా.. అప్రోచ్ రోడ్డులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా తరచూ ఈ అప్రోచ్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని రెండు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అప్రోచ్ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారాయని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు రోడ్డు మర్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం
కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం


