బాల మేధావి అక్షయ
తిప్పర్తి: ఆడుతూ పాడుతూ మారం చేసే చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సాధించి పలువురి మన్ననలు అందుకుటోంది. తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన నెలగొందరాశి రమేష్, దివ్యభారతి దంపతుల మొదటి సంతానం అక్షయ. రెండున్నరేళ్ల వయసున్న అక్షయ తన మేధోశక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం అక్షయ నల్లగొండలోని ఆల్ఫా స్కూల్‌లో యూకేజీ చదువుతుంది. అక్షయ తండ్రి రమేష్ నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి దివ్యభారతి మార్కెట్‌కు, షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనపడిన వస్తువులను అక్షయకు పదేపదే చెప్పగా ఆమె వాటన్నింటినీ గుర్తుకుపెట్టుకుని తిరిగి చెప్పేది. అక్షయ జ్ఞాపకశక్తిని గ్రహించిన తండ్రి రమేష్ ఆమెకు ప్రపంచ దేశాల పేర్లు ఒకటి రెండుసార్లు చెప్పగా.. ఆమె వెంటనే టకీమని వాటిని తిరిగి చెప్పేది. రెండున్నరేళ్ల వయసులోనే 104 దేశాల పతాకాలను గుర్తించడంతో పాటు రసాయన మూలకాలు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాపటాలను గుర్తించి వారి పేర్లు చెప్పేది. రాష్టాలు, వాటి రాజధానులు, పండ్లు, కూరగాయల పేర్లు, ప్రపంచ పటంలోని ఖండాలను గుర్తించి చెప్పేది. అక్షయ మేధోశక్తిని తండ్రి రమేష్ గుర్తించి తెలిసిన వారి ద్వారా 2022లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులలో పేరు నమోదు చేయించాడు. వారు అక్షయ మేధోశక్తిని గుర్తించి బుక్ ఆఫ్ ఛాంపియన్ వరల్డ్ రికార్డులో ఆమె పేరును ప్రకటించారు. అనంతరం ఆ సంస్థ చైర్మన్ బీవీ పట్టాభిరాం చిన్నారి అక్షయ పేరు వరల్డ్ రికార్డులో నమోదు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు అక్షయ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ సైతం అందుకుంది.
బాల మేధావి అక్షయ


