గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను త్రిపురారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండల ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పిల్లి మణికంఠ, మాడుగులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన దండు వినోద్, బండి కోటేష్ స్నేహితులు. వీరు ముగ్గురు గంజాయి సేవించేవారు. వీరికి ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కొమ్మెర శివ తన స్నేహితుడైన చల్లా అంజి వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయించేవాడు. గురువారం శివ తన స్నేహితుడైన అంజి వద్ద 1.6 కిలోల గంజాయిని మాచర్లలో కొనుగోలు చేసి ఉదయం పది గంటల సమయంలో త్రిపురారం గ్రామ శివారులో గంగదేవరమ్మ గుడి వద్ద మణికంఠ, వినోద్, కోటేశ్‌కు విక్రయిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు త్రిపురారం ఎస్‌ఐ కె. నరేశ్ తన సిబ్బందితో వెళ్లి నలుగురిని పట్టుకున్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న చల్లా అంజి పరారీ ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో హాలియా సీఐ డి. సతీష్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీను, చంద్రశేఖర్, నాగేశ్వర్‌రావు, ఆర్. శ్రీనివాస్, హోంగార్డులు ఉన్నారు.
250 గ్రాముల గంజాయి పట్టివేత
మిర్యాలగూడ టౌన్: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ పీఎన్‌డీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన అమరలింగంకు మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో నివాసముంటున్న పులిజాల లక్ష్మీనారాయణ, నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఎస్‌కే రియాజ్, రవీంద్రనగర్‌కు చెందిన కె. వంశీతో పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి ఈ నెల 12న మిర్యాలగూడ మండలం గుండూరు గ్రామ శివారులోని యాదాద్రి వెంచర్ వద్ద గంజాయి తీసుకురాగా.. పక్కా సమాచారం మేరకు మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఎస్‌కే రియాజ్, వంశీని అరెస్ట్ చేశారు. అమరలింగం, లక్ష్మీనారాయణ పర్యారయ్యారు. పట్టుబడిన వారి నుంచి 250 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.


