మేకలు, గొర్రెలు చోరీ చేస్తున్న ఐదుగురి అరెస్ట్
కొండమల్లేపల్లి: మేకలు, గొర్రెలు చోరీ చేస్తున్న దొంగల ముఠాను గురువారం చింతపల్లి పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో దేవరకొండ ఏఎస్పీ మౌనిక విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలానికి చెందిన అమ్ములూరి విజయ్‌ప్రసాద్, అమ్ములూరి నందిని, నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్‌కుమార్, గుంజ కార్తీక, అనుముల మండలం అలీనగర్‌కు చెందిన సంపంగి శారద, సంపంగి వెంకటేష్, శబరీష్ ముఠాగా ఏర్పడి మేకలు, గొర్రెల చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున చింతపల్లి మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. అటుగా స్కార్పియో కారులో వచ్చిన వీరు పోలీసులను చూసి తప్పింకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకునే లోగా సంపంగి వెంకటేష్, శబరీష్ కారు దిగి పారిపోయారు. మిగతా ఐదుగురికి అదుపులోకి తీసుకుని వారి వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో చెక్ చేయగా.. గతంలో వారిపై మేకల దొంగతనం కేసు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారిని విచారించగా పలు దొంగతనాలు చేసినట్లు నిజం ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారు గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి తిరిగి నేరాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వారి నుంచి మూడు కార్లు, రూ.1.20లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న నాంపల్లి సీఐ రాజు, చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తితో పాటు పోలీస్ సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించగా.. ఏఎస్పీ మౌనిక వారికి రివార్డు అందజేశారు.
ఫ పరారీలో మరో ఇద్దరు


