‘కథ’నరంగంలో సత్తా చాటుతున్న విద్యార్థులు
చిట్యాల: వారంతా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులలో పలువురు ప్రవృత్తిగా కవిత, రచనలు రాసే వారున్నారు. ఆ ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో విద్యార్థులు సైతం కవితలు, కథలు రాస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన నలభై మంది విద్యార్థులు 2019లో ఖమ్మం జిల్లాలోని పాపికొండలు ప్రాంతానికి ఉపాధ్యాయులతో కలిసి విజ్ఞాన, విహారయాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో విద్యార్థులు పొందిన అనుభవాలను, అనుభూతులను కథ రూపంలో రాసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఆ పాఠశాలలో భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్న పెరుమాళ్ల ఆనంద్, పొట్టబత్తుల రామకృష్ణ సంపాదకులుగా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు రాసిన వ్యాసాలు, కవితలతో ‘రెక్క విప్పిన బాల్యం’ పుస్తకాన్ని ప్రచురించి ప్రముఖ కవి, రచయిత ఏనుగు నర్సింహారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు.
ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు..
అదే పాఠశాలకు చెందిన మరికొంత మంది విద్యార్థులు కూడా కథలు రాసేందుకుగాను ఆసక్తితో ఉండటంతో 2022లో కవులు, రచయితలతో ప్రత్యేక శిబిరాన్ని ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. ఆ శిబిరంలో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు పలు కథలు రాయగా.. ఆ కథలతో ‘కథల బండి’ పుస్తకాన్ని ముద్రించారు.
2024లో జర్నీ పుస్తకం..
2023లో మరోసారి పాఠశాల విద్యార్థులు విజ్ఞాన, విహార యాత్రలో భాగంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి వెళ్లారు. ఆ యాత్ర నేపథ్యంలో విద్యార్థులు రచించిన కథలతో ‘జర్నీ’ పుస్తకాన్ని ఉపాధ్యాయులు పెరుమాళ్ల ఆనంద్, పొట్టబత్తుల రామకృష్ణ సంపాదకీయంలో ముద్రించారు. ఈ పుస్తకాన్ని 2024 నవంబర్ 14న ఆవిష్కరించారు.


