కథల పోటీల్లో బహుమతుల పంట
చిట్యాల మండలం గుండ్రాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయురాలు ఉప్పల పద్మ పర్యవేక్షణలో పలువురు విద్యార్థినులు కథలు, రచనలు చేస్తూ రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. గతేడాది బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కథల పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థిని సీమ హన్సిక పాల్గొని కన్సొలేషన్ బహుమతి పొందింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీల్లో ఆ పాఠశాల విద్యార్థిని కంకాల శిరీష రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి సాధించింది. ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బాల సాహిత్య పరిషత్, మాచిరాజు బాల సాహిత్య పీఠం సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీల్లో గుండ్రాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని కూరాకుల భావన రాసిన నాన్న కష్టం కథకు ప్రోత్సాహక బహుమతి లభించింది. తెలంగాణ సాహితి నల్లగొండ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పాటల పోటీల్లో పాఠశాలకు చెందిన ఆర్. వాసవి ద్వితీయ స్థానంలో, అక్షిత కన్సొలేషన్ బహుమతులు పొందారు.


