నీటి గుంతలో పడి రైతు మృతి
ఫ మృతుడి నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు
కనగల్: నీటి గుంతలో పడి రైతు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం కనగల్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండల కేంద్రానికి చెందిన రైతు నక్కల శంకరయ్య(64) ధాన్యం కాంటా వేయించేందుకు గురువారం తెల్లవారుజామున తన కుమారుడు రాజుతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. శంకరయ్యను వడ్ల రాశి వద్ద ఉండమని చెప్పి రాజు అమ్మగూడెం గ్రామంలో వడ్ల కాంటాను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. రాజు తిరిగి వచ్చేసరికి పొలం వద్ద తన తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతుండగా పొలం పక్కన గల నీటి గుంతలో శంకరయ్య పడిపోయి ఉన్నాడు. పక్కనే ఉన్న హమాలీలను పిలిపి వారి సహాయంతో శంకరయ్యను గుంత నుంచి బయటకు తీయగా.. అప్పటికే అతడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు శంకరయ్య నేత్రాలను నల్లగొండ లయన్స్ క్లబ్ ఐ డొనేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు కుటుంబ సభ్యులు దానం చేశారు.


