మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Nov 13 2025 8:34 AM | Updated on Nov 13 2025 8:34 AM

మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు

మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు

నల్లగొండ : ధాన్యం దిగుమతి చేసుకోవడంతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, మిల్లర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు అవుతోందని, కొనుగోళ్లు ఆలస్యమైతే రైతులకు సమాధానం చెప్పలేమని.. అవసరమైతే రాత్రింబవళ్లు కాంటాలు వేయాలని అధికారులను ఆదేశించారు. రోజుల తరబడి మిల్లుల వద్ద లారీలు నిలపడం వల్ల కేంద్రాల్లో కాంటా వేసిన బస్తాలు తరలించడం సాధ్యం కాదని.. మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిల్లర్లు నారాయణ, ఇంద్రారెడ్డి, భద్రాద్రి ధాన్యం తడవడం వల్ల నూకలు అవుతున్నాయని.. బాయిల్డ్‌రైస్‌ సరఫరాకు అనుమతి ఇప్పించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆరు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి మిల్లింగ్‌ చార్జీలు రావాలని, రవాణా బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్పందించిన మంత్రి కేంద్ర మంత్రితో మాట్లాడి బాయిల్డ్‌ రైస్‌ పెట్టేందుకు అనుమతి కోసం కృషి చేస్తానని, ముఖ్యమంత్రితో మాట్లాడి బకాయిలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మిల్లర్లు మిల్లు పాయింట్‌కు వచ్చిన ధాన్యం తిరిగి పంపించడం సరి కాదన్నారు. ఏదైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడుకోవాలని పేర్కొన్నారు. గత సీజన్‌ సీఎంఆర్‌ తీసుకోకపోవడం వల్ల మిల్లుల్లో స్థలం లేదని సీఎంఆర్‌ తీసుకుంటే ధాన్యం దిగుమతికి ఇబ్బంది ఉండదని మిల్లర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోళ్లపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, పౌర సరఫరాల అధికారి వెంకటేష్‌, జిల్లా మేనేజర్‌ గోపికృష్ణ, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీసీఓ పత్యానాయక్‌, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మార్కెటింగ్‌ అధికారి ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రం పరిశీలన

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ సమీపంలో చర్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. ధాన్యం తేమశాతాన్ని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, హమాలీలతో మాట్లాడారు. గడచిన 20 రోజులు వర్షానికి ధాన్యం తడవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని.. ప్రస్తుతం రోజూ 10,000 మెట్రిక్‌ టన్నులకు పైగానే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులు తొందరపడి ప్రైవేట్‌లో ధాన్యం అమ్మవద్దని సూచించారు. బ్రాహ్మణ వెల్లంలతోపాటు, కాల్వలు పూర్తయితే చర్లపల్లి, మర్రిగూడెం, అన్నెపర్తి, కంచనపల్లి చెరువులను నింపుతామని తద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా చుట్టుపక్కల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణకు రూ.17 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఫ ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలి

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement