నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలే..
● పాఠశాలలు, ఆస్పత్రుల్లోనూ
అరకొర వసతులే..
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత
నల్లగొండ : జిల్లాలో ప్రాజెక్టుల కింద 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూసేకరణ చేసినా.. నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నల్లగొండలో ఆమె పర్యటించారు. మేధావులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పర్యటనలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. నక్కలగండి, మోత్యతండాను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సందర్శిస్తే వారి సమస్యలు అర్థమవుతాయన్నారు. అక్కడ భూమి సేకరించారు వృథాగానే ఉందని, అలాంటప్పుడు రైతులకు సేద్యం చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించానని ఎంఆర్‌ఐ లేకపోవడం దారుణమన్నారు. అరకొర సదుపాయాలు ఉన్నా వైద్యులు, నర్సులు సేవలు అందిస్తున్నారని వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. దేవరకొండ మండలం కొమ్మేపల్లి గురుకులంలో వసతులు లేవని, 450 మంది ఉంట్లే ఇద్దరు వర్కర్లు ఉన్నారని పిల్లల దుస్తులు లాండ్రీ చేసేవారు లేరన్నారు. అధికారులు, మంత్రులు ఒక రోజైన హాస్టల్, గురుకులాల్లో నిద్రిస్తే వారి బాధలు తెలుస్తాయన్నారు. సాగర్‌లోని నాగార్జునకొండ మీద, నల్లగొండలోని ఛాయా, పచ్చల సోమేశ్వరాలయంలో పలు చారిత్రక నిర్మాణాలను ఏపీలోని గుంటూరు మ్యూజియానికి తరలించారని వాటిని వెనక్కు తేలేకపోయారన్నారు.
ఎంసీహెచ్ సందర్శన
నల్లగొండ టౌన్ : జాగృతి జనంబాటలో భాగంగా ఎమ్మెల్సీ కవిత బుధవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్) సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని ఎస్‌ఎన్‌సీయూ, ఐసీయూ, మెటర్నటీ వార్డులను సందర్శించి రోగులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు ఆస్పత్రి శానిటేషన్ సిబ్బంది తమకు గత నాలుగు నెలలుగా వేతనాలను అందడం లేదని, వేతనాలను ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.


