ధాన్యం ఇవ్వకున్నా..
చర్యల్లో వెనుకడుగు.. మిల్లర్లదే దర్జా
ఫ ఆరు మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అధికారులు
ఫ ఆయా మిల్లులకు ఈ సీజన్‌లో ధాన్యం కేటాయింపు నిలిపివేత
ఫ వేరే మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని తీసుకొని మరాడిస్తున్న.. ఆ మిల్లులు
ఫ సీఎంఆర్ ధాన్యం అమ్ముకున్నారని తేలినా.. చర్యలకు అధికారుల వెనుకంజ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కొందరు మిల్లర్లు అక్రమాల బాటను వీడడం లేదు. గతంలో జిల్లాలోని ఆరు మిల్లులు ప్రభుత్వం నుంచి 4.5 లక్షల క్వింటాళ్ల ధాన్యం తీసుకుని దానికి సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వలేదు. దీంతో వారికి ఈ వానాకాలం సీజన్‌లో అధికారులు ధాన్యం కేటాయించలేదు. అయినా వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇతర మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మరాడించి తమ పని కానిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇతర జిల్లాల్లో సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై కేసులు నమోదు చేస్తున్నా.. నల్లగొండ జిల్లాలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం రాకపోవడంతో రూ.కోట్లలో నష్టం తప్పడం లేదు. కొంతమంది అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కై చర్యలకు వెనుకంజ వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఆరు మిల్లులకు ధాన్యం కేటాయింపు లేదు
రెండేళ్ల కిందట జిల్లాలోని ఆరు మిల్లులు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వకుండా అమ్ముకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఆ మిల్లర్లను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఈ వానాకాలం సీజన్‌లో ఆ మిల్లులకు ధాన్యం ఇవ్వకుండా ఆపేశారు తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆయా మిల్లులు ఇతర మిల్లుల నుంచి ధాన్యం తీసుకుంటున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో నల్లగొండలో అధికారులు ధాన్యమే కేటాయించని ఓ మిల్లుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించారు. అప్పట్లో ఈ విషయంలో బయటకు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
అన్నీ ప్రభుత్వమే ఇస్తున్నా..
ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ధాన్యం కొని రైతులకు డబ్బులు ఇస్తోంది. లారీల ట్రాన్స్‌పోర్టుకు డబ్బు ఇస్తోంది. ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపుతోంది. మిల్లర్ దానిని మరాడించి సీఎంఆర్ కింద బియ్యం ఇచ్చినందుకు డబ్బులు చెల్లిస్తోంది. ఈ ప్రక్రియలో ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. మిల్లర్లు మాత్రం రూపాయి పెట్టుబడి పెట్టకుండా ధాన్యం తీసుకొని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. అయినా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతునఆన అధికారుల్లో చలనం లేకుండాపోతోంది.
ప్రభుత్వ ధాన్యాన్ని మింగేశారని తేల్చిన అధికారులు చర్యలు చేపట్టడంలో వెనుకడుగు వేస్తున్నారు. మిల్లర్ల నుంచి అందే అమ్యామ్యాల కారణంగానే కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బియ్యం ఇవ్వకుండా ఏళ్ల తరబడి కాలం గడుపుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆరోపణలు వచ్చాక, తనిఖీలు చేశాక, అక్రమాలు జరిగినట్లు తేలాక కూడా చర్యలు చేపట్టడం లేదంటే.. మిల్లర్ల లాబీ ప్రభావం అధికారులపై ఏస్థాయిలో ఉందో అర్థఽం చేసుకోవచ్చని పౌర సరఫరాల విభాగంలో చర్చ జరుగుతోంది. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని రాబట్టడం లేదని, గతేడాది కూడా అక్రమాలకు పాల్పడిన కొన్ని మిల్లులకు ధాన్యం కేటాయించి వారి అక్రమాలకు మరింత వత్తాసు పలికారన్న ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం కాజేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి, మిల్లులను సీజ్ చేస్తే అక్రమాలకు పుల్‌స్టాప్ పడే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ధాన్యం ఇవ్వకున్నా..


