13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీఈఓ ఉపేందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెమిస్టర్‌లో 5,400, మూడవ సెమిస్టర్‌లో 5,830, ఐదవ సెమిస్టర్‌లో 5,597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేటలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రజాబాటలో విద్యుత్ శాఖ
నల్లగొండ : పట్టణంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు ఆ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా మంగళవారం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నల్లగొండలోని 21 వార్డులో పర్యటించారు. వార్డులో ఉన్న విద్యుత్ లూజ్ లైన్లు, దెబ్బతిన్న కరెంట్ స్తంభాలను పరిశీలించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, విద్యుత్ డీఈ అన్నయ్య, సలీం, షామిర్ పాల్గొన్నారు.
నల్లగొండకు నేడు మంత్రి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ బుధవారం నల్లగొండకు రానున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు నల్లగొండలోని క్యాంపు కార్యాలయం(ఇందిరా భవన్)లో ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దుబ్బ రూప కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో ధాన్యం, పత్తి కొనుగోళ్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, వర్షాల వల్ల వాటిల్లిన నష్టంపై సమీక్షిస్తారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తారు.
ట్రక్‌షీట్ జారీపై
విజిలెన్స్ విచారణ
మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఆలగడప పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ట్రక్ షీట్ జారీ చేయడంపై మంగళవారం విజిలెన్స్ డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. రైతులు మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి సైదిరెడ్డి, త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన ధనావత్ తులస్యనాయక్‌ను విచారించారు. పీఏసీఎస్ ఇన్‌చార్జి సీఈఓ సైదులు, వ్యవసాయ విస్తరణాధికారి ఆఫ్రీన్‌ను ధాన్యం రాకుండా ట్రక్ షీట్ ఎలా మంజూరు చేశారని, ట్యాబ్‌లో ఎలా అప్‌లోడ్ చేశారని ప్రశ్నించారు. 741బస్తాలు(296.40 క్వింటాళ్లు) ధాన్యం మిర్యాలగూడ పట్టణ పరిధిలోని శ్రీశివసాయి రైస్ ఇండస్ట్రీస్‌కు తరలించినట్లు విచారణలో రైతులు పేర్కొన్నారు. కాగా పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. అనంతరం శ్రీశివసాయి రైస్ మిల్లును తనిఖీ చేశారు.
రైస్‌మిల్లు తనిఖీ
చిట్యాల: కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు సకాలంలో అన్‌లోడింగ్ చేసుకోవడం లేదని ఓ రైతు మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ వెంటనే స్పందించి ధాన్యం రైస్ మిల్లును తనిఖీ చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. దీంతో ఆయన చిట్యాల పట్టణంలో భువనగిరి రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లును తనిఖీ చేశారు. ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం చిట్యాల శివారులోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి ఉన్నారు.
13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు


