ప్రజల గోస ప్రభుత్వానికి పట్టదా?
చందంపేట, నాంపల్లి, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ప్రజల గోస ప్రభుత్వానికి పట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాక రైతులు, పరిహారం అందక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో మంగళవారం ఆమె జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించారు. నాంపల్లి మండలంలోని లక్ష్మాపురంలో నిర్మిస్తున్న కిష్టరాయినిపల్లి రిజర్వాయర్‌ను, చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టును, తిరుమలగిరిసాగర్ మండలంలోని నెల్లికల్లు లిఫ్టు పనులను పరిశీలించారు. ఆయా చోట్ల నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పలువురు రైతులు మోంథా తుపాన్ కారణంగా పంట నష్టపోయామని ఆమెకు వివరించారు. ఆయా చోట్ల ఆమె మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లా మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డి నెల్లికల్లు లిఫ్టును పద్దెనిమిది నెలల కాలంలోనే పూర్తి చేస్తానని చెప్పారని.. ఆ తర్వాత ఎటుపోయారో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగలేదన్నారు. నెల్లికల్లు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో ఈ జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న సోయి ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని, తేమశాతం అఽధికంగా ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూతవేటు దూరంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నా నేటికి సాగునీరు ఈ ప్రాంత రైతులకు అందకపోవడం ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. భూ నిర్వాసితుల తరఫున తాను ముందుండి కొట్లాడుతానన్నారు. కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అశోక్‌యాదవ్, రూప్‌సింగ్, రవీందర్, నిరంజన్, శంకర్, రామ్‌కోటి, శివారెడ్డి, జితేందర్, ప్రజాపతి, నరేష్ తదితరులు ఉన్నారు.
ఫ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఫ జాగృతి జనం బాటలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలన
ప్రజల గోస ప్రభుత్వానికి పట్టదా?
ప్రజల గోస ప్రభుత్వానికి పట్టదా?


