ఊరి చివరనే మద్యం
మధ్యాహ్నం తర్వాతే అమ్మకాలు?
మునుగోడు : మునుగోడు పట్టణంలో ఇప్పటి వరకు కొనసాగిన మద్యం దుకాణాలు ఇక, నుంచి గ్రామ శివారుకు తరలనున్నాయి. ఈ నెల చివరి నాటికి మద్యం దుకాణాల లీజు ముగియనుంది. ఇటీవల ప్రభుత్వం టెండర్లు పిలిచిన సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నియంత్రించాలనే ఆలోచనతో కొన్ని సూచనలు చేశారు. దీంతో నూతన టెండర్లలో వైన్ షాపులు దక్కించుకున్న వారు ఎమ్మెల్యే సూచనలు పాటించేందుకు ఇప్పటికే గ్రామ శివారులో దుకాణాల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
డిసెంబర్ 1వ నూతన షాపులు..
మునుగోడు మండలంలో నాలుగు మద్యం దుకాణాలు ఉండగా.. చౌటుప్పల్ రోడ్డులో ఒకటి, నల్లగొండ రోడ్డులో రెండు, చండూరు రోడ్డులో ఒకటి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన దుకాణాలు ప్రారంభించాల్సి ఉండడంతో.. అందుకు అవసమైన నిర్మాణాలను వేగవంతం చేశారు. అయితే ఎంతో కాలంగా జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను గ్రామ శివారులో ఏర్పాటు చేస్తుండడంతో మహిళలు, మద్యం వ్యతిరేకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం దుకాణాలను గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో పాటు.. మధ్యాహ్నం తరువాతే మద్యం విక్రయాలు చేపట్టాలని నూతన వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మద్యం దుకాణాల్లో సిట్టింగ్‌లు కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగించేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు గతంలో మాదిరి బెల్ట్ దుకాణాలకు మద్యం విక్రయించకుండా.. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులే గ్రామాల్లో ప్రత్యేకంగా మినీ దుకాణాలను ఏర్పాటుచేసి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. మినీ దుకాణాల ఏర్పాటు కోసం సంబంధిత అధికారులను కూడా కలిసినట్లు సమాచారం. విచ్చలవిడి మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసేలా వ్యాపారులు కూడా సిద్ధం కావడంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పలువురు కృతజ్జతలు తెలుపుతున్నారు.
ఫ మునుగోడు శివారులో ఏర్పాటుకు నూతన వ్యాపారుల నిర్ణయం
ఫ మద్యం అమ్మకాలు నియంత్రించేలా సన్నాహాలు


