ఇసుకను బ్లాక్ చేస్తే కేసులు పెడతాం
నల్లగొండ : ఇసుకను బ్లాక్ చేసి బ్రోకర్లు అమ్మితే కేసులు నమోదు చేస్తామని జిల్లా మైనింగ్ అధికారి జాకబ్ హెచ్చరించారు. నీలగిరి పట్టణంలో ఇసుక సరఫరాలో అక్రమాలపై ‘సాక్షి’లో ఈనెల 8న ‘ఆన్‌లైన్ ఇసుక అధ్వానం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాలతో మైనింగ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనింగ్ అధికారి జాకబ్ మాట్లాడుతూ ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం సరఫరా చేయాలని అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. కొందరు డ్రైవర్లు.. ఇసుక బాగలేదని, దూరంగా ఉందని మాయమాటలు చెప్పి అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిని సహించమన్నారు. అధికంగా డబ్బులు వస్తాయని ఇసుకను బ్రోకర్లకు అమ్మితే డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని, ఆ ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కస్టమర్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న చిరునామాకు అలాట్ అయిన వెంటనే డెలివరీ చేయాలన్నారు. ఇకనుంచి ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, దళారీ వ్యవస్థను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య మాట్లాడుతూ ప్రతి ట్రాక్టర్ డ్రైవర్ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలని ఎంట్రీ, ఎగ్జిట్ కచ్చితంగా నమోదై ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మైనింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ మైనింగ్ ఏడీ జాకబ్
ఇసుకను బ్లాక్ చేస్తే కేసులు పెడతాం


