ఏఈఓ, ఇన్‌చార్జి సీఈఓ సస్పెన్షన్
మిర్యాలగూడ : ధాన్యం సేకరణ నిబంధనలు ఉల్లంఘించిన ఆలగడప క్లస్టర్ వ్యవసయ విస్తరణ అధికారి (ఏఈఓ) కుమారి ఆఫ్రీన్, అవంతీపురం కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి, ఆలగడప పీఏసీఎస్ ఇన్‌చార్జి సీఈఓ కె.సైదులును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కాకుండా నేరుగా మిల్లులకు పంపించినట్లు వచ్చిన కథనాలపై జిల్లా సహకార అధికారి పత్యానాయక్ ఈనెల 9న అవంతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో విచారణ చేపట్టారు. 750 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ట్రక్‌షీట్‌తో రైతుల పొలం నుంచే నేరుగా మిర్యాలగూడలోని శ్రీ శివసాయి రైస్ ఇండస్ట్రీస్‌కు పంపించినట్లు విచారణ తేలింది. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని దింపుకున్నట్లుగా అనుమతి షీట్ జారీ చేయడంతో ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తయింది. ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఏఈఓ, పీఏసీఎస్ ఇన్‌చార్జి సీఈఓపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నంత వరకు ముందస్తు అనుమతి లేకుండా పనిచేస్తే స్థానం వదిలి వెళ్లవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సర్వీసు నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌డేలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ 30 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహిరించాలని ఆదేశించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుభాష్ యాదవ్
నల్లగొండ టౌన్: అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అల్లి సుభాష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా యాదవ సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో అల్లి సుభాష్ యాదవ్, గౌరవాధ్యక్షుడు రావుల భిక్షం యాదవ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేష్‌యాదవ్‌కు జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు నియామక పత్రం అందజేశారు.


