నిలిచిన ధాన్యం ఎగుమతులు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ మండలంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీల కొరత ఏర్పడింది. అనేక కేంద్రాల్లో ధాన్యం బస్తాల ఎగుమతి కాక ఎక్కిడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నల్లగొండ మండలంలోని జీకే అన్నారం కొనుగోలు కేంద్రానికి మూడు రోజులుగా లారీలు రావడం లేదు. కేంద్రంలో సుమారు 5 వేల బస్తాలు ఎగుమతి కాకుండా నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు లారీలను ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ రవాణా చేయాల్సి ఉంది. మిల్లర్లు ధాన్యం అన్ లోడింగ్ చేసుకోవడంలో ఆలస్యం చేస్తుండడంతో లారీలు అక్కడే ఉండిపోతున్నాయి. అదేవిధంగా లారీలను కాంట్రాక్టర్ సరిపడా అందుబాటులో ఉంచకపోవడం కూడా కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని అధిక లారీలను పంపాలని రైతులు కోరుతున్నారు.


