ఆయన ఇంట్లో రెండు వేల పుస్తకాలు
మోత్కూరు: పుస్తకాలపై ఆయనకు ఉన్న మక్కువతో ఏడు పదుల వయస్సులోనూ పుస్తక పఠనం కొనసాగిస్తున్నారు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన చెరుకు అగ్గిరాములు. మోత్కూరులో 6వ తరగతి వరకు చదువుకున్న అగ్గిరాములు పేదరికం కారణంగా అక్కడితో చదువు మానేశారు. హైదరాబాద్‌కు వెళ్లి హోటల్‌లో కొన్నేళ్లు పనిచేసి, 1973లో బతుకుదెరువు కోసం చైన్నెకి వెళ్లారు. అక్కడ రిక్షా తొక్కుతూ జీవనం సాగించారు. ఆ సమయంలో చైన్నెలో రామస్వామి పెరియార్, అన్నాదొరై, ఎంజీఆర్ వంటి నాయకుల సభలకు వెళ్లి వారి ప్రసంగాలు విని కమ్యూనిజంపై అభిమానం పెంచుకుని తదనంతరం మోత్కూరుకు వచ్చి సీపీఐలో చేరారు. ఆ రోజుల్లో విజయవాడ నుంచి విశాఖ ఆంధ్ర పత్రికను పోస్టులో తెప్పించుకొని ఆయన చదివేవారు.. యక్షగానాలు, కీర్తన పుస్తకాలు, కమ్యూనిస్టు ఉద్యమ పుస్తకాలు, ఉద్యమ నాయకుల జీవిత చరిత్రల పుస్తకాలు కొని చదివారు. కమ్యూనిస్టు సభలు, సమావేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఏర్పాటు చేసే పుస్తక ప్రదర్శనలో పలు రకాల పుస్తకాలను కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన సుమారు రెండు వేల పుస్తకాలు సేకరించారు. పుస్తకాలకు బైండింగ్ చేయడంతో పాటు కొన్ని ఆర్టికల్స్‌కు నామినేషన్లు కూడా చేయించారు. ఆయన సేకరించిన పుస్తకాలను ఇంట్లోని బీరువా, పెట్టెల్లో భద్రపరిచేవారు. హైదరాబాద్, చైన్నె పట్టణాలకు బతుకుదెరువు కోసం వెళ్లినప్పుడు వివిధ దేశాలకు చెందిన నాణేలు, వివిధ కంపెనీలకు చెందిన పెన్నులు, అగ్గిపెట్టెలు సేకరించారు.
గ్రంథాలయానికి అప్పగిస్తా
నా వద్ద ఉన్న సుమారు రెండు వేల పుస్తకాలను ఏదైనా గ్రంథాలయానికి అప్పగిస్తా. అదేవిధంగా ఎవరైనా అధి కారులు అడిగితే వివిధ దేశాలకు చెందిన నాణాలను కూడా ఇచ్చేస్తా. కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, రావి నారాయణరెడ్డి వంటి నాయకులు నాకు ఆదర్శం. వారి జీవిత చరిత్ర పుస్తకాలు చదివాను. – చెరుకు అగ్గిరాములు, కొండగడప
పుస్తక పఠనంపై మక్కువతో
సేకరించిన అగ్గిరాములు
వివిధ దేశాల నాణేలు, పెన్నులు, అగ్గిపెట్టెలు సైతం..
ఆయన ఇంట్లో రెండు వేల పుస్తకాలు
ఆయన ఇంట్లో రెండు వేల పుస్తకాలు


