అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లిన లారీ
హుజూర్‌నగర్: లారీ అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై హుజూర్‌నగర్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ నుంచి మిర్యాలగూడ వెపు వెళ్తున్న లారీ హుజూర్‌నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద మలుపు తప్పే క్రమంలో అదుపుతప్పి రోడ్డు వెంట విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. లారీ ముందు టైర్లు డ్రెయినేజీ కాలువలో ఇరుక్కుపోవడంతో అక్కడే ఆగిపోయింది. అర్ధరాత్రి సమయం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. విద్యుత్ స్తంభంత విరిగిపోవడంతో ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మోహన్‌బాబు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ ఏఈ రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తరుచూ ప్రమాదాలు..
హుజూర్‌నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో మూలమలుపు ఎక్కువగా ఉండటంతో తరచూ ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఇక్కడ ప్రత్యేకంగా సర్కిల్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


