మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: మత్తు ట్యాబెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని శనివారం మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన మచ్చ నవీన్, నక్క మహేష్ స్నేహితులు. వీరు కొంతకాలంగా ఏపీలోని పల్నాడు జిల్లా కారెంపూడిలోని వీరభద్ర మెడికల్ షాపులో ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మోప్రోగ్జావిన్ అనే మత్తు ట్యాబ్లెట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి మిర్యాలగూడకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో కొద్దిరోజులుగా వారిద్దరిపై నిఘా పెట్టారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద వన్‌టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నవీన్, మహేష్ ఒక కవర్‌లో మత్తు ట్యాబ్లెట్లు తీసుకుని వెళ్తూ పట్టుబడ్డారు. వారిద్దరితో పాటు కారెంపూడిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న శెట్టి హనుమంతరావు, శెట్టి జయరామచంద్ర ప్రసాద్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నవీన్, మహేష్, శెట్టి హనుమంతరావును అరెస్ట్ రిమాండ్‌కు తరలించామని, మరో నిందుతుడు శెట్టి జయరామచంద్ర ప్రసాద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ నాగభూషణ్‌రావు, ఎస్‌ఐ సైదిరెడ్డి, కానిస్టేబుళ్లు రాజామ్, వీరబాబు, నరసింహ, ప్రసాద్, శ్రీను, ఉన్నారు.


