ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: ఫైనాన్స్ వ్యాపారి గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన చెందిన చీకూరి కృష్ణంరాజు(49) కొంతకాలంగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో గల హుడా సాయినగర్ కాలనీలో నివాసం ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం దామెర గ్రామంలో తన వ్యవసాయ పొలానికి వచ్చాడు. అక్కడే ఉన్న పనిమనిషితో గడ్డిమందు తెప్పించుకున్నాడు. కృష్ణంరాజు తనతోపాటు తెచ్చుకున్న కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలుపుకొని తాగాడు. అనంతరం సాయినగర్ కాలనీలోని తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకుని కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కృష్ణంరాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫైనాన్స్ వ్యాపార లావాదేవీల్లో జరిగిన తేడాలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని అతని స్నేహితులు చెబుతుండగా.. నడుమునొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడని మరికొంత మంది చెబుతున్నారు.


