పామాయిల్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా
గరిడేపల్లి: పామాయిల్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడేనికి చెందిన షేక్ అస్గర్(40) హాలియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని అంపాపురం పామాయిల్ ఫ్యాక్టరీకి డీసీఎంలో పామాయిల్ పంట లోడ్‌ను తరలిస్తున్నాడు. అప్పన్నపేట గ్రామ శివారులో ఇటీవల పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తప్పించే క్రమంలో డీసీఎం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలు
మోటకొండూర్ : సైకిల్ నడిపించుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మోటకొండూర్ మండలంలోని తేర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. తేర్యాల గ్రామానికి చెందిన నల్ల శంకరయ్య వ్యవసాయ బావి వద్దకు సైకిల్‌ను నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్‌ను తప్పించి వెనకాల వస్తున్న సైకిల్‌ను ఢీ కొట్టింది. దీంతో శంకరయ్యకు కాలికి బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని ట్రాక్టర్ డ్రైవర్ పంజాల సాయి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కానిస్టేబుళ్లపై దాడి
చేసిన నిందితుల అరెస్ట్
చండూరు: ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చండూరు మండల కేంద్రంలోని భవాని ఫంక్షన్‌హాల్ పక్కన కారుంగు క్రాంతికుమార్, మహమ్మద్ సాజిద్‌బాబా, మహమ్మద్ నాసర్‌పాషా అనే ముగ్గురు వ్యక్తులు ఈనెల 4న అర్ధరాత్రి సమయంలో మద్యం బాటిళ్లతో ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారికి సూచించగా సదరు వ్యక్తులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ విషయమై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్‌ఐ కారింగు వెంకన్నగౌడ్ శుక్రవారం తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సూర్యాపేట : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పెన్‌పహాడ్ ఎస్‌ఐ గోపికృష్ణ శుక్రవారం తెలిపారు. పెన్‌పహాడ్ మండలంలోని దోసపహాడ్ మూసీ నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దోసపహాడ్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామ శివారులో పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
అక్రమంగా ఇసుక
విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
చౌటుప్పల్ : అక్రమంగా ఇసుకను నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్‌రోడ్డులో ఇసుకను కుప్పలుగా పోసి అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన బలికె సత్యనారాయణ అనే వ్యక్తి నిల్వ చేసిన 15 టన్నుల ఇసుకను గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇసుకను సీజ్ చేసి సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.


