రాష్ట్రస్థాయి తైక్వాండో జట్టుకు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో 69వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలను గురువారం నల్లగొండ పట్టణంలోని ఎలిమినేటి మాధవరెడ్డి పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి తైక్వాండో జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అరుణాచల్‌ప్రదేశ్‌లో జరుగనున్న జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి విమల, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవీ.గోనారెడ్డి, నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ సైదులు, డీఎస్‌డీఓ అక్బర్‌అలీ, ఎం.ఈశ్వర్, తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.యూనుస్ కమాల్, అంబటి ప్రణీత్ పాల్గొన్నారు.
సీపీఐ శతాబ్ది సభను జయప్రదం చేయాలి
నకిరేకల్ : ఖమ్మంలో డిసెంబర్ 26న నిర్వహించే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కోరారు. నకిరేకల్‌లోని గుడిపాటి పంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన సీపీఐ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల ప్రస్థానంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిందని.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. నిరంతరం ప్రజల పక్షాన ఉండేది కమ్యూనిస్టులేనని గుర్తుచేశారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వరికి ఎకరానికి రూ.40 వేలు, పత్తికి ఎకరానికి రూ.60 వేలు పరిహారం అందించాలని కోరారు. సీపీఐ మండల కార్యదర్శి గౌని లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్, నాయకులు బుడిగె సైదులు, శాంతి, జిల్లా యాదయ్య, పెండ్యాల శంకర్, ఎండీ.అక్బర్ తదితరులు పాల్గొన్నారు.


