దెబ్బతిన్న ముదిమాణిక్యం మేజర్ షట్టర్
నిడమనూరు : సాగర్ ఎడమకాల్వపై ఉన్న ముదిమాణిక్యం మేజర్ షట్టర్ నీటి ప్రవాహానికి దెబ్బతిన్నది. ప్రధాన కాల్వలో నీటి ప్రవాహంతో మరమ్మతులు సాధ్యం కాలేదు. బుధవారం ముది మాణిక్యం మేజర్‌ను ఎన్నెస్పీ డీఈడి మాలూ నాయక్, ఏఈ అశోక్, పలువురు మేజర్, మైనర్ల ఏఈలు, డీఈలు పరిశీలించారు. తూము షట్టర్ మరమ్మతుల కోసం సాగర్ ఎడమకాల్వ నీటిని నిలిపివేశారు. కాల్వలో అంతర్భాగమైన పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నుంచి మిర్యాలగూడ పట్టణానికి నీరందించే పైపులైన్లకు నీరు అందడం లేదు. దీంతో పట్టణంలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడమకాల్వలో నీటి పూర్తిగా పోవడానికి మరికొంత సమ యం పడుతుందని నిర్ధారణకు వచ్చిన అధికా రులు గురువారం మరోసారి తూము షట్టర్ పరిశీ లించి, మరమ్మతులు చేస్తామని చెబుతున్నారు. ఒకవేళ షట్టర్ మరమ్మతులు సాధ్యం కాకపోతే దెబ్బతిన్న షట్టర్ పూర్తిగా మూసివేసి, రెండో షట్టర్ ద్వారా కాల్వకు నీటి విడుదల చేస్తామని అధి కారులు చెబుతున్నారు. వేసవిలో కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని నిలిపివేసిన అనంతరం షట్టర్ మరమ్మతులు చేస్తామని పేర్కొంటున్నారు. 2019 లో ఒకసారి ముదిమాణిక్యం మేజర్ షట్టర్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఎన్నెస్పీ అధికారులు పాత షట్టర్‌కు మరమ్మతులు చేసి బిగించడంతో.. ఇప్పుడు మళ్లీ దెబ్బతిందని.. అప్పుడే కొత్త షట్టర్ బిగిస్తే బాగుండేదని రైతులు అంటున్నారు.


