బడికి తీసుకెళ్తాడు.. వండిపెడతాడు!
కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న బాలరాజు
బైక్‌పై పిల్లలను పాఠశాలకు తీసుకొస్తున్న ఉపాధ్యాయుడు బాలరాజు
డిండి : విద్యార్థుల భవిష్యత్ కోసం ఓ ఉపాధ్యాయుడు తపన పడుతున్నాడు. తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ఆదర్శంగా నిలస్తున్నాడు డిండి మండల పరిధిలోని కొత్తతండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు. ఈ ఉపాధ్యాయుడు రోజూ విద్యార్థులంతా పాఠశాలకు చేరుకునేలా చూస్తాడు. స్కూల్‌కు రావడానికి ఇబ్బంది పడే పిల్లలను.. వారి ఇళ్ల వద్దకే వెళ్లి తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకొస్తాడు. తండాల్లోని పిల్లలు కూలి పనికి వెళ్లకుండా రోజూ పాఠశాలకు పంపాలని, చదువుకుంటే భవిష్యత్ బాగుంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాడు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు గైర్హాజరైతే.. విద్యార్థులు ఆకలితో ఉండకూడదని భావించి.. ఉపాధ్యాయుడు బాలరాజు కట్టెల పొయ్యిపై వంట చేసి పిల్లలకు వడ్డిస్తారు. ఉపాధ్యాయుడు అందిస్తున్న సేవలతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చదువుకుంటేనే మార్పు వస్తుందని, తాను చేసే సేవ చిన్నదే కానీ.. వాళ్ల భవిష్యత్‌కు బాట వేస్తుందనే నమ్మకం ఉందని.. ఉపాధ్యాయుడు బాలరాజు పేర్కొంటున్నారు.
బడికి తీసుకెళ్తాడు.. వండిపెడతాడు!


