పెద్దదేవులపల్లి చెరువులు ఖాళీ !
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలోని చెరువులు ఖాళీ అయ్యాయి. చెరువుల్లో నీటిని సంబంధిత అధికారులు ఎడమ కాలువ గుండా దిగువకు వదులుతున్నారు. చెరువులకు ఎగువన సాగర్ ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న ముదిమాణిక్యం మేజర్ వద్ద మరమ్మతులు చేపడుతుండడంతో చెరువు నీరు దిగువకు వదులుతున్నట్లు సమాచారం. అయితే పెద్దదేవులపల్లి గ్రామంలోని చిన్న చెరువు, పెద్ద చెరువులు సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. చెరువు కింద వేల ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది. సుమారు 900 మంది మత్స్యకారులు ఈ చెరువులపై జీవనాధారం పొందుతున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి కూడా ఇక్కడి నుంచే పైపులైన్ల ద్వారా తాగునీరు అందిస్తారు. ప్రస్తుతం ఎన్నెస్పీ అధికారులు చెరువుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో తూములకు నీరందక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా చేపలు దిగువకు వెళ్లి మత్స్యకారులకు ఉపాధి దొరక్క రోడ్డున పడే అవకాశం ఉందని మత్స్య పారిశ్రమిక సహకార సంఘం అధ్యక్షుడు సింగం ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు చెరువు నీటిని పూర్తిగా వదలకుండా చర్యలు తీసుకోవాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు.


