సర్వే ప్రారంభం
చందంపేట : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ మార్గంలో భూమిలో పరిస్థితులను అంచనా వేసేందుకు వీటెమ్ ప్లస్ హెలీబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ప్రారంభమైంది. ఆర్మీ అధికారుల సహకారంతో చేపడుతున్న ఈ సర్వే ద్వారా టన్నెల్ మార్గంలో భూమి లోపల ఏం ఉన్నాయి.. బండరాళ్లు ఉన్నాయా.. షియర్ జోన్ ఉందా.. నీటి ఆనవాళ్లు ఉన్నాయా.. తవ్వకం పనులను కొనసాగించడానికి వీలుందా..? అనే అంశాలు తెలియనున్నాయి. వెయ్యి మీటర్ల లోతు వరకు ప్రతి అడుగున్నరకు ఒక స్కాన్ ద్వారా ఒక ఈమేజ్‌ను తీయనుంది. వారం రోజుల పాటు సాగనున్న సర్వే ద్వారా సొరంగం పనులు నిర్వహించేందుకు గల అనుకూలమైన ప్రాంతాన్ని గుర్తించనున్నారు. సర్వే నివేదిక ఆధారంగా తదుపరి టన్నెల్ తవ్వకం పనులను ప్రభుత్వం చేపట్టనుంది. కాగా సోమవారం ప్రారంభమైన సర్వే తీరును సీఎం, మంత్రులు, అధికారులు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు.


