పత్తి కొనుగోళ్లలో కొర్రీలు.. రైతుల నిరసన
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి వద్ద పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రం వద్ద తేమ పేరుతో కొర్రీలు పెడుతూ పత్తి కొనడం లేదని నిరసిస్తూ కోదాడ–జడ్చర్ల రహదారిపై రైతులు సోమవారం ధర్నా చేశారు. పత్తి మిల్లు యజమానులు, దళారులు కుమ్మకై ్క సీసీఐ కేంద్రాలలో పత్తి మద్దతు ధర రూ.8,110 ఉండగా.. తేమ ఉందని చెబుతూ రూ.6వేల నుంచి రూ.6,500 కే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్పారు. తేమ శాతం 15 నుంచి 20 శాతం ఉంటుందని, 8 నుంచి 12 శాతం ఉంటేనే పత్తి కొంటామని సీసీఐ అధికారులు చెప్పడంతో మళ్లీ పత్తిని తీసుకెళ్లి ఆరబెట్టాలంటే బండి కిరాయిలు, కూలీల ఖర్చులు భారం అవుతాయని, దీనికి తోడు కురుస్తున్న వర్షాతో రైతులు చేసేదేమీ లేక తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు పేర్కొన్నారు. పత్తిని ఎంత ఆరబెట్టినా తేమ శాతం 8 నుంచి 12 శాతానికి తగ్గడం లేదని 14 నుండి 20 శాతం వరకు వస్తుందని, దీంతో కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనడం లేదని మళ్లీ తీసుకెళ్లి ఆరబెట్టాలంటే దాదాపు రూ.20వేల వరకుఖర్చు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 శాతం వరకు తేమ శాతం ఉన్నా పత్తి కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తేమను కొలిచే మిషన్‌లో కూడా తేడా వస్తుందని తేమ శాతం సరిగా చూపించడం లేదని రైతులు చెప్పారు. ఎస్‌ఐ అజ్మీరా రమేష్, తహశీల్దార్ నరేందర్ రైతుల ఆందోళన విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనే విధంగా చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.


