రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా భార్గవచారి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడేనికి చెందిన కన్నెకంటి భార్గవచారి రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గల పల్లవి మోడల్ స్కూల్లో తెలంగాణ రోప్ స్కిప్పింగ్ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా సంఘం ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా కన్నెగంటి భార్గవచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు నియామక పత్రం అందజేశారు.
మహిళ అదృశ్యం
చౌటుప్పల్ : పట్టణ కేంద్రానికి చెందిన వివాహిత మహిళ అదృశ్యమైంది. ఆమె భర్త సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ సోమవారం తెలిపారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కై తాపురం గ్రామానికి చెందిన మహిళ(35) కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటుంది. భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లిన భర్త ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇల్లు కూల్చారని నిరసన
మోత్కూరు : అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని బాధిత కుటుంబం పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపింది. ఈ సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కాశవారిగూడెం కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాశవారిగూడెంలోని ప్రభుత్వ భూమి అయిన సర్వే నంబర్ 402లో మహ్మద్ పకీర్ అహ్మద్ గత 30 సంవత్సరాలుగా గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నాడు. గత పది సంవత్సరాల క్రితం దశల వారీగా ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అయితే ఆ స్థలం తనదని, అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన బెల్లి నగేష్ తహసీల్దార్‌ను సంప్రదించాడు. కాశవారిగూడెంలో సర్వే నంబర్ 402లోని 242 గజాల భూమి తనదేనని, ప్రభుత్వం క్రీడాకారుల కోటాలో 2020లో తనకు కేటాయించిందని, ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరాడు. దీంతో తహసీల్దార్ అనుమతులతో మున్సిపాలిటీ వారు ఆ ఇంటిని జేసీబీ సాయంతో సోమవారం నేలమట్టం చేశారు. దీంతో మహ్మద్ పకీర్ అహ్మద్ కుటుంబం కాలనీవాసులతో కలిసి కాలనీ ఎదుట పెట్రోల్ డబ్బాతో రోడ్డుపై బైఠాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్దిచెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఈ విషయంపై తహసీల్దార్ జ్యోతిని వివరణ కోరగా.. కాశవారిగూడెంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి కూల్చివేసినట్లు తెలిపారు.
యువకుడిపై కేసు నమోదు
చౌటుప్పల్ : మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ సోమవారం తెలిపారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళలు నిల్చున్నప్పుడు, బస్సు ఎక్కే సమయంలో తన సెల్‌ఫోన్‌తో వారి ఫొటోలను తీస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ మహిళ గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. వారు బస్టాండ్‌కు చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి సెల్‌ఫోన్‌లో మహిళలు, యువతుల ఫొటోలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా భార్గవచారి


