కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా బీజేపీ
నల్లగొండ టౌన్ : ఎన్డీఏ ప్రభుత్వం ఎల్‌ఐసీలో ఉన్న రూ.33 వేల కోట్ల ప్రజల బీమా సొమ్మును సంక్షోభంలో ఉన్న ఆదానీ కంపెనీకి కట్టబెట్టి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం వేదికగా డిసెంబర్ 26న జరిగే సీపీఐ శతాబ్ద ఉత్సవ ముగింపు బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం, పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా నవంబర్ 17 నుంచి చేపట్టే సీపీఐ జాతను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఉజ్జిని యాదగిరిరావు, పల్లా నర్సింహారెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, లోడంగి శ్రవణ్‌కుమార్, పబ్బు వీరస్వామి, గురిజ రామచంద్రం, బంటు వెంకటేశ్వర్లు, బొల్గూరి నర్సింహ, నల్పరాజు రామలింగయ్య, తీర్పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


