గుండాల: ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి(22)అంత్యక్రియలు సోమవారం స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో మృతురాలి బంధువులు కర్నూలు నుంచి అనూషారెడ్డి మృతదేహాన్ని తీసుకుని సోమవారం ఉదయం 6.30గంటలకు వస్తాకొండూర్ గ్రామానికి వచ్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అనూషారెడ్డి మృతదేహానికి ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తలకొరివి పెట్టారు. ఆమె తల్లిదండ్రులు విలపిస్తున్న తీరును చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శ
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి అనూషారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనూషారెడ్డి మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జాతీయ రహదారులపై వాహనాల స్పీడును తగ్గించేందుకు ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వాహనాలు జాగ్రత్తగా వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.


