ఆలేరు కేంద్రంగా అధిక వడీ్డ దందా..!
ఆలేరు: ‘రూ.లక్ష అప్పు తీసుకుంటే చేతికి ఇచ్చేది రూ.75వేలు మాత్రమే.. మిగతా రూ.25వేలు వడ్డీ కింద తీసుకుంటారు. ఈ వడ్డీ కేవలం పది రోజులకే’ ఇది క్యాసినో జూదంలో నష్టపోయిన ఓ బాధితుడి ఆవేదన. క్యాసినో జూదం పేరుతో ఆలేరు కేంద్రంగా పెద్దఎత్తున అధిక వడ్డీ దందా కొనసాగుతోంది. ఇటీవల గోవా క్యాసినో జూదం వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అధిక వడ్డీ బాధితులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాసినో జూదంలో రూ.లక్షల్లో నష్టపోయి, అధిక వడ్డీలు కట్టలేక కొందరు మధ్యతరగతి వర్గాలు కుదేలవుతుండగా.. అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ, ముందు జాగ్రత్తగా అప్పు తీసుకున్న వారి నుంచి తెల్ల కాగితాలపై వడ్డీ వ్యాపారులు సంతకాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రశ్నించిన బాధితులను సదరు వడ్డీ వ్యాపారులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
గెలిచినా డబ్బులు ఇవ్వరు..
క్యాసినో జూదం ఆడేందుకు గోవాకు చాలామంది వెళ్తుండగా.. క్యాసినో ఆడేందుకు ఏజెంట్‌ల పేరు మీద నిర్వాహకుల వద్ద రూ.లక్ష వరకు డిపాజిట్ చేస్తుంటారు. ఇందుకు నిర్వాహకులు రూ.లక్ష విలువ చేసే కాయిన్‌లను ఇస్తారు. ఈ కాయిన్‌లతో పలు రకాల జూదం ఆడుతారు. ఒకవేళ జూదంలో గెలిచినా డబ్బులు ఇవ్వడానికి నిర్వాహకులు కొర్రీలు పెడుతుంటారని సమాచారం. రూ.లక్ష గెలుచుకుంటే కేవలం ఖర్చుల కోసం రూ.30వేల మాత్రమే అందజేస్తుంటారని, పెట్టుబడి రూ.లక్ష, గెలుచుకున్న రూ.లక్షలో రూ.30వేలు పోను మిగతా రూ.70వేలను బ్యాంకు ఖాతాలో జమచేస్తామని క్యాసినో ఆడిన వారిని నిర్వాహకులు బురిడీ కొట్టిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయమై తమను గోవాకు తీసుకెళ్లిన ఏజెంట్‌లు కూడా నిర్వాహకులను ప్రశ్నించరని క్యాసినో బాధితులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరికై నా డబ్బులు కావాలంటే మరోసారి గోవాకు వచ్చినప్పుడు క్యాసినో ఆడేందుకు పెండింగ్ మొత్తానికి కాయిన్‌లు అందజేస్తారని తెలుస్తోంది. ఇలా తనకు రూ.3లక్షల వరకు ఇవ్వలేదని ఓ బాధితుడు పేర్కొన్నాడు.
రూ.లక్ష అప్పుగా తీసుకుంటే
పది రోజులకే రూ.25వేల వడ్డీ
ముందుగానే అప్పు తీసుకున్న వారితో
తెల్ల కాగితాలపై సంతకాలు
పోలీసులకు క్యాసినో బాధితుల ఫిర్యాదు
బిట్ కాయిన్ సెటిల్‌మెంట్లు
క్యాసినో జూదం తరహాలోనే ఆలేరులో బిట్ కాయిన్ వ్యవహారాలూ పెద్దఎత్తున జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కొందరు ఏజెంట్‌లుగా అవతారమెత్తి మహిళలు, యువకులతో బిట్ కాయిన్‌లో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నట్లు సమాచారం. బిట్ కాయిన్‌లో సుమారు రూ.8లక్షల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయానని పది రోజుల కిత్రం ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సదరు మహిళకు నచ్చజెప్పారు. తర్వాత ఏజెంట్‌తో మాట్లాడి సుమారు రూ.4లక్షలకు సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఇలా బిట్ కాయిన్ వివాదాలను గుట్టుచప్పుడు కాకుండా ఏజెంట్‌లు బాధితులతో సెటిల్‌మెంట్ చేసుకుంటూ కేసులు కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దేందుకు మధ్యవర్తులు కొందరు పెద్దఎత్తున డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆలేరులో బిట్ కాయిన్ ఉచ్చులో పడి సుమారు 300 మంది రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టగా, చాలా మంది నష్టాలను చవిచూస్తున్నట్లు తెలిసింది.


