ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు పాతర!
20 రకాల ఐటమ్స్ ల్యాబ్‌కు పంపాం
నల్లగొండ టూటౌన్ : పిల్లలతోపాటు పెద్దలు అమితంగా ఇష్టపడే మిఠాయిల (స్వీట్ల) తయారీలో కొందరు వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. వాటి తయారీకి వినియోగిస్తున్న ముడి పదార్థాలు, కారం, పిండి మొదలైనవి కాలం చెల్లిన పురుగులు పట్టినవి వాడుతూ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఇంట్లో ఏ శుభకార్యమైనా..కొత్త దుకాణాలు ప్రారంభమైనా అక్కడ స్వీట్స్ ఉండాల్సిందే. తీపితోనే మొదలు పెట్టాలనే సెంట్‌మెంట్‌ను స్వీట్స్ షాపు వ్యాపారులు బాగా వినియోగించుకుంటున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు హానికరమైన రసాయనాలు కలుపుతూ ఘుమఘుమలాడే మిఠాయిలు తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
నాణ్యతాప్రమాణాలు పాటించకుండా..
ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, చిట్యాల, చౌటుప్పల్, హాలియా, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, నకిరేకల్, తిరుమలగిరి ముఖ్య పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కొనసాగుతున్న షాపుల్లో నాణ్యమైన స్వీట్స్‌ను తయారీ చేయకుండా కల్తీమయం చేస్తున్నారు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదనేది బహిరంగ రహస్యం. ఇటీవల దీపావళి ముందు రోజు ఉమ్మడి జిల్లాలోని పలు స్వీట్స్ దుకాణాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేయగా స్వీట్స్ షాపు యాజమానుల డొల్లతనం బయట పడిన విషయం తెలిసిందే.
తనిఖీలు లేకనే నాణ్యత డొల్ల..
ముఖ్య పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఇటీవల స్వీట్స్ షాపులు పెరిగాయి. ఇళ్లలో తయారు చేసుకునే కంటే ఎక్కువగా దుకాణాల్లోనే స్వీట్స్ కొనుగోలు చేయడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. కానీ పెరుగుతున్న ఆహార పదార్థాల దుకాణాలకు తగ్గట్టుగా ఫుడ్ సేఫ్టీ ఉద్యోగులు లేకపోవడం.. ఉన్న ఉద్యోగులు కూడా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు వస్తే తప్ప తనిఖీలు చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో స్వీట్ల తయారీ దుకాణాల్లో అపరిశుభ్రత, బూజు, పురుగులు, ఈగలు వాలినా, ఎలుకలు తిరుగుతున్నా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్వీట్స్ తినే గడువు ముగిసినా సంబంధిత యాజమానులు వాటిని తీసేయకుండా వినియోగదారులకు అంటగడుతున్నారు. వ్యాపారుల్లో మార్పు రావాలంటే సంబంధిత అధికారులు ప్రతినెలా ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ స్వీట్స్ తయారీలో పాటించని నాణ్యతాప్రమాణాలు
ఫ కాలం చెల్లిన కారం.. పురుగులు పడిన ముడి పదార్థాలు వాడకం
ఫ ఆకర్షణ కోసం హానికరమైన రసాయనాలు మిక్సింగ్
ఫ ఇటీవల అధికారుల తనిఖీల్లో బయటపడిన వ్యాపారుల డొల్లతనం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల స్వీట్స్ షాపుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి 20 రకాలు స్వీట్స్‌ను ల్యాబ్‌కు పంపించాం. ఇప్పటికే 15 దుకాణాలకు నోటీసులు జారీ చేశాం. ల్యాబ్ నుంచి నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
– జ్యోతిర్మయి, యాదాద్రి జోనల్ ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్
ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు పాతర!
ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు పాతర!


