‘స్వనిధి’ రుణసాయం పెంపు
లక్ష్యం మేరకు రుణాలు ఇప్పిస్తాం
నల్లగొండ టూటౌన్ : వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం స్వనిధి పథకం రుణ సాయాన్ని పెంచి తీపికబురు వినిపించింది. ఎనిమిది నెలల క్రితం పీఎం స్వనిధి సైట్‌ను మూసివేయడంతో చాలామంది వీధి వ్యాపారులు ఇక ఆ పథకం రద్దు అయినట్లేనని భావించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మళ్లీ దీనిని పునః ప్రారంభిస్తూ గతనెలలో మార్గదర్శకాలు విడుదల చేసింది. 2030 వరకు ప్రస్తుతం ఇచ్చిన మార్గదర్శకాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో రూ.10వేలు ఇచ్చిన దానిని తాజా మార్గదర్శకాల ప్రకారం దానిని రూ.15 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండవ విడత ఇచ్చే రుణాన్ని రూ.25వేలకు పెంచుతూ బ్యాంకర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక వీధి వ్యాపారి మొదట రూ.15 వేల రుణం తీసుకొని నెలనెలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుణం తీరిన తరువాత రెండవ విడత రూ.25 వేలు ఇస్తారు. ఇది కూడా బ్యాంకుల్లో నెల వారీగా చెల్లించిన తరువాత మూడవ సారి రుణం రూ.50 వేలు ఇస్తారు. రూ.50వేలు అప్పు తీరిన తరువాత నాల్గవ సారి రుణం తీసుకుంటే ఎలాంటి పెంపుదల చేయలేదు.
నామమాత్రపు వడ్డీకే రుణం..
వీధి వ్యాపారం చేసుకొని స్వయం ఉపాధి పొందే పేదల కోసం కేంద్రం పీఎం స్వనిధి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నామమాత్రపు వడ్డీకే వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణం లభించనుంది. బ్యాంకర్లకు చెల్లించిన వడ్డీలో కూడా కేంద్రం రూ.40 శాతం తిరిగి చెల్లిస్తుంది. బ్యాంకుల్లో ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే రుణం వలన వేల మంది పేదలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది.
మున్సిపాలిటీల వారీగా టార్గెట్
పీఎం స్వనిధి ద్వారా బ్యాంకర్లతో మాట్లాడి అర్హులైన పేదలకు రుణాలు ఇప్పించాలని కేంద్రం మున్సిపాలిటీల వారీగా లక్ష్యం విధించింది. దీంతో జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లోని మెప్మా సిబ్బంది దృష్టి సారించారు. మొదటి విడతగా జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో 2,141 మందికి వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించాల్సి ఉంది.
వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పునః ప్రారంభమైంది. గత నెలలోనే ఉత్తర్వులు వచ్చాయి. మున్సిపాలిటీలకు విధించిన టార్గెట్ ప్రకారం వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతిఒక్క వీధి వ్యాపారి పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– శివాజీ, మెప్మా ఉద్యోగి
ఫ వీధి వ్యాపారులకు తీపికబురు వినిపించిన కేంద్రం
ఫ ఎనిమిది నెలల తర్వాత పథకం పునఃప్రారంభం
ఫ రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచిన రుణం
ఫ 2,141 మందికి రుణాలు ఇప్పించాలని లక్ష్యం
రుణాల టార్గెట్..
మున్సిపాలిటీ వీధి వ్యాపారులు
నల్లగొండ 678
మిర్యాలగూడ 630
నకిరేకల్ 03
నందికొండ 76
హాలియా 120
చిట్యాల 137
దేవరకొండ 298
చండూరు 199


