బీఆర్‌ఎస్ నేతలకు అహంకారం తగదు
శాలిగౌరారం: ప్రజా వ్యతిరేకతతో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇంకా అహంకారంతో వ్యవహరించడం తగదని టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామంలో ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరుగు ప్రయాణంలో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు చామల జయపాల్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారం చేపట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో అప్పులపాలైన తెలంగాణను ఆర్థికపరంగా అనేక ఒడిదుడుకులు వచ్చిన వాటిని తట్టుకుంటూ ప్రభుత్వం పాలనను అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనను తట్టుకోలేని బీఆర్‌ఎస్‌పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చిన బూతులు తిడుతూ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. వారు మాట్లాడే భాష, వ్యవహారశైలిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కాంగ్రెస్‌పార్టీ వహిస్తున్న మౌనాన్ని అసమర్థత అనుకుంటే పొరపాటేనని, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు తిరుగబడితే బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులకు లాగులు కూడా ఉండవన్నారు. పదేళ్లలో ఊహకందని రీతిలో అక్రమార్జన, ప్రజాధనం దోపిడీలకు పాల్పడిన బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయంగా లబ్ధిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని కోరారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు బండపల్లి కొమరయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొల్లికొండ గణేశ్, మండల సియర్ నాయకులు చామల జయపాల్‌రెడ్డి, చింత ధనుంజయ్య, వడ్లకొండ పరమేశ్, జమ్ము అశోక్, పుల్లూరి దేవేందర్, అంజయ్య, అనిల్, భరత్, ఇబ్రహీం, నాగరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాధుయాష్కీగౌడ్


