‘మొంథా’ తుపానుతో జాగ్రత్త
నల్లగొండ: రానున్న రెండు, మూడు రోజులు ‘మొంథా’ తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆమె ఆదివారం నల్లగొండ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలికాన్పరెన్స్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. శ్రీమొంథ్ఙా తుపానుతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కిందికి వేలాడే విద్యుత్ వైర్లు, ఒరిగిన విద్యుత్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలోకి ప్రజలు వెళ్లవద్దని సూచించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని తీసుకురావద్దన్నారు. రానున్న మూడు రోజుల పాటు తహసీల్దార్‌లు వారు పనిచేసే కార్యస్థానాలలోనే ఉండాలని, ఒకవేళ ఇదివరకే సెలవు దరఖాస్తు చేసి ఉంటే సెలవులన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్‌లు ఈనెల 27 మధ్యాహ్నం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేయడమే కాకుండా, నాణ్యత కలిగిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. మొంథా తుపాన్‌ను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా గ్రామ పాలనాధికారులు.. కేంద్రాల నిర్వాహకులకు, రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయదేవి పాల్గొన్నారు.
ఫ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావొద్దు
ఫ జిల్లా రైతులు, ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన


