ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
ఫ మాజీ మంత్రి జానారెడ్డి
రామగిరి(నల్లగొండ): ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన జానారెడ్డి.. జమియత్ ఉలేమా హింద్ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఎహసానుద్దీన్ సాబ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతోపాటు ముస్లిం స్థితిగతులపై చర్చించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ ఉలేమాలు ప్రస్తావించిన అన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మో హన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, నీలగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
జాబ్‌మేళాను
వినియోగించుకోవాలి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో ఈనెల 25న నిర్వహించే మెగా జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. హుజూర్‌నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్ నేషనల్ స్కూల్‌లో నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను ఎస్పీ కె. నరసింహ, నిర్వాహకులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీల వారీగా స్టాల్స్ కేటాయింపుల వివరాలను అందజేయాలని సింగరేణి ప్రతినిధి చందర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


