
రాకపోకలు.. ఆన్‌లైన్!
నూతన విధానం ఇలా..
ఉన్నత అధికారుల ఆదేశాలు పాటిస్తున్నాం
మిర్యాలగూడ, నాగార్జునసాగర్ : రాష్ట్ర సరిహదుల్లో రవాణా చెక్ పోస్టులను బుధవారం నుంచి తొలగించారు. నేరుగా పన్నుల వసూళ్లలో జరిగే అక్రమాలకు చెక్ పెట్టినందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిపై గతంలోనే జీవో విడుదల చేయగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు గాను రవాణశాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక చెక్‌పోస్టులను నిర్వహించారు. తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రవాణశాఖ కమిషనర్ ఆదేశానుసారం అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణా శాఖ చెకపోస్టులను బుధవారం మూసివేశారు. చెక్‌పోస్టుల వద్ద రోడ్లపై ఉన్న బారీకేడ్లు, డ్రములు తొలగించారు. చెక్‌పోస్టుల్లో ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నీచర్, వాహనాల వివరాల దస్త్రాలను నల్లగొండకు తరలించారు. బుధవారం వాడపల్లి వద్ద ఉన్న చెక్‌పోస్టును జిల్లా రవాణా శాఖ అధికారి లావణ్య సందర్శించారు. చెక్‌పోస్టుల తొలగింపుపై సిబ్బందికి సూచనలు చేశారు.
ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల తొలగింపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్‌పోస్టులు ఏర్పాటు కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాడపల్లి, నాగార్జునసాగర్, కోదాడ సమీపంలోని నల్లబండగూడెం వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే తదితర వాహనాల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఈ చెక్‌పోస్టుల ద్వారా ప్రతి నెలా సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. బుధవారం నుంచి ఈ మూడు చోట్ల చెక్‌పోస్టులను తొలగించారు. నూతన విధానంలో వాహనదారులు తాత్కాలిక, పర్మినెంట్ ట్యాక్స్‌లను ఆన్‌లైన్‌లో చెల్లించి రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
ఫ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఎత్తివేత
ఫ రోడ్లపై బారికేడ్ల తొలగింపు
ఫ ఫర్నిచర్ నల్లగొండకు తరలింపు
ఆన్‌లైన్ పన్ను వసూలుకు కోసం ప్రభుత్వం వాహన యాప్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ విధానం అమలులో భాగంగా సరిహద్దు వద్ద రవాణాశాఖ ఏఎన్‌పీఆర్ (ఆటో నెంబర్ ప్లేట్ రీడర్) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఈ – ఎన్‌ఫోర్స్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను గుర్తించేలా దానికి వాహన యాప్‌ను అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాల తెలుస్తాయి. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే మొబైల్ టీమ్‌లు వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తాయి.
రవాణాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నాం. ప్రస్తుతం అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టులను మూసివేయాలని ఆదేశాలు అందాయి. ఈ మేరకు వాడపల్లి వద్ద ఉన్న చెక్‌పోస్టును ఎత్తివేశాం. అక్కడ ఉన్న బోర్డులు, బారీకేడ్లను తొలగించి ఫర్నీచర్, పరికరాలు, రికార్డులను జిల్లా కేంద్రానికి తరలించాం. ఇకమీదట అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఆన్‌లైన్ విధానంలో పన్ను వసూలు చేస్తాం.
– ఎ.సతీష్, ఏఎంవీఐ, వాడపల్లి

రాకపోకలు.. ఆన్‌లైన్!