డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష, జరిమానా
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని బుధవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చగా.. అందులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2000 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4,000 జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి పీవీ రమణ తీర్పు వెలురించినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సుకు
తప్పిన ప్రమాదం
భూదాన్‌పోచంపల్లి: ఎదురుగా వచ్చే వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు పంట పొలంలోకి ఒరిగిపోయింది. ఈ ఘటన బుధవారం ఉదయం భూదాన్‌పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల మధ్యలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పోచంపల్లి నుంచి వయా శివారెడ్డిగూడెం, ఇంద్రియాల, పెద్దరావులపల్లి గ్రామా ల మీదుగా భువనగిరికి వెళ్తోంది. ఈ క్రమంలో శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల మధ్య న ఇరుకు రోడ్డులో మరొక వాహనం ఎదురుగా రావడంతో దానికి దారిచ్చే క్రమంలో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లగా.. పక్కనే ఉన్న పంటపొలంలో దిగబడి బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులంతా వెంటనే బస్సులో నుంచి కిందకు దిగారు. అనంతరం జేసీబీ సహాయంతో బస్సును పంట పొలంలో నుంచి బయటకు లాగారు.
లూజ్ సిమెంట్
విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
చిట్యాల: సిమెంట్ పరిశ్రమల నుంచి వచ్చే ట్యాంకర్ల ద్వారా లూజ్ సిమెంట్ సేకరించి ప్రజలకు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్ బుధవారం తెలిపారు. చిట్యాల పట్టణ శివారులో భువనగిరి రోడ్డులో గుండాల శ్రీను సిమెంట్ ట్యాంకర్ల నుంచి సేకరించిన లూజ్ సిమెంట్‌ను విక్రయిస్తుండగా మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి వద్ద 83బస్తాల సిమెంటు నిల్వ ఉంది. ఒక్కో బస్తాలో 50 కేజీల చొప్పున సిమెంట్ నింపి విక్రయిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


